Sunday, September 1, 2013

ఆంగ్లాధ్రం


కొడుకూ, కూతురు,మనుమలు అన్నము తిను వేళగూడ, 

ఇంగిలీషు చిలకలవలె కిచకిచ సడి చేయచుండ 

కిమ్మనలేకుండె బామ్మ, చిన్నప్పుడు నేర్వలేదు

అయ్యో! ఇపుడెట్లు వచ్హు ఆంగ్లభాష నాకనుకొనె. 
   
చందమామ  చూపించుచు మూన్ ,మూనని తల్లి నేర్పె 
  
మాటలొచ్హు క్షణమునుండి 'మమ్మీ'  అనె చిట్టితల్లి

'అమ్మా ' అని అరచి అన్నమడుగు  ముష్టి వాడు కూడ! 

'మమ్మీ ' అని పిలవకుంటే కదుపుమాడు రోజులొచ్హె    

పొరుగువారి పుల్లకూర రుచియందురు తెలుగువారు

ఆ సామెత నిజము చేయుచు ' ఆంగ్లాంధ్రప్రదేశ ' మయ్యె 
  
మన పొరుగుననున్న తమిళ  కన్నడులను చూచియైన 

మాత్రుభాష  తీయదనము మహిచాటగ కదలరేమి ! 

ప్రపంచీకరణమంటు సాకు చెప్ప సరికాదది

అట్టి  ప్రమాదము కల్గగ అన్యభాషలకునుగలదు .

అయినా మన తెలుగువారి తెలివెక్కడ తెల్లవారె !

               ---   జి భారతి.

Friday, August 30, 2013

మరో ఆవకాయాస్త్రం...




ఆహా! ఏక్కడివీరుచుల్ మనమునాహ్లాదాంబుధుల్పొంగెనే

మా హృద్వంటకమంటలార్పసకలామర్త్యాళి మర్త్యాళిపై


సౌహార్దంబుననావకాయనుసుధాసారమ్ముతోనింపె దా

సోహంబవ్వరెలోకులీఘుమఘుమల్ సోకంగఘ్రాణాగ్రమున్ ||

                       ----   రఘురాం

Friday, August 23, 2013

అహో ! ఆవకాయ ...



 
 
 
  ఆవకాయా నమస్తుభ్యం!

నువ్వు ఆంధ్రదేశంలో పుట్టుట మా భాగ్యం

నిన్ను మించిన రుచి ఉండుట అసాధ్యం

జాడీలతో  ఏడాది పొడవునా  ఏలు ఇంటింటివంటింటి సామ్రాజ్యం.


--- ఉదయకిరణ్

Saturday, August 17, 2013

శంఖారావం (పదండి ముందుకు...)



ప్రభాకరుడు ప్రకాశిస్తూ  ప్రపంచానికి వెలుగు ప్రసరిస్తూ

ప్రగతి కోసం పయనించండని హెచ్హరిస్తున్నాడు

అరవిరిసిన పద్మం ఆహ్వానం పలుకుతోంది

ఆహ్లాదం కలిగిస్తూ శాంతి పావురం యెగురుతోంది

శాంతి లేదు శాంతి లేదు  అని మనోవిహంగం యెగసిపడుతోంది

నేటి భారతం కార్పణ్య నిలయమై కాలుష్యం విరజిమ్ముతోంది

అవినీతికి పట్టం కట్టిన పాలకులున్న దేశంలో

దానవత్వానికి దైవత్వాన్ని అపాదిస్తున్న దివాంధులం

గతం ఘనమని నినదిస్తూ నేటి నేతల పాలన చూస్తూ

ధర్మదేవత దగా పడ్డది లేవరా!                   
       
నివురుగప్పిన నిప్పులా ఇటు కూలపడితే  కాదురా!

ఋణముతీర్చగ  దేశమాతకు  కొడుకువై  రావేమిరా?

విశ్వశాంతికి దారిజూపే విజ్ఞానమూర్తివై  లేచిరా !

వెలుగులీనే వేకువై నువు వేగమేరావాలిరా!

గాంభీర్యానికి మారుపేరై  విలసిల్లే సాగరుడే

శివమెత్తిన కోపంతో  తరంగతాడిత  ఘీంకారంతో

విలయతాండవం చేస్తున్నాడు!

సమస్యలతో సహజీవనం చేస్తూ

ఆల్లకల్లోలాంతరంగాన్ని అణచలేక ఆక్రోశిస్తూ

ఆత్మశాంతికై అలమటిస్తూ

ప్రభాతసమయ ప్రశాంతికోసం తపిస్తూ

కన్నీటి కడలిలా  మారినప్పుడు 

ఋణము  తీర్చగా, దేశమాతకు కొడుకువై రావేమిరా!

           ---  చల్లా మైత్రేయి

Wednesday, May 28, 2008

శ్రీరామ శతకం


శ్రీరామ శతకం


శ్రీశ శ్రీరామరావయ్య సీతగూడి
భక్తులనుజూసి కాపాడ భద్రగిరికి
వేడ్కనిన్ జూడభద్రుడు వేడగానె
రామశరణము శ్రీరామరామరామ


తల్లిభూదేవి రాక్షసతంత్రమునకు
ఓర్పు నశియించి బాధలనోపలేక
బాధబాపగ పద్మ సంభవునివేడ
రామరావయ్య శరణు శ్రీ రామరామ


తాను శివభక్తుడనని నమ్మి తన్మయమున
తపసుచే వరమందిన తామసుండు
పదితలల రావణుని చంపు పరంధామ
రామశరణము శ్రీరామరామరామ



Sunday, May 25, 2008

ఈ మాధుర్యం తెలుగు వారిది(కి) మాత్రమే...

తెలుగుభాషకే ప్రత్యేకత సంతరించి భారతీశిరోభూషణమైన అవధాన పద్ధతికి భక్త్యంజలి....
మొదటి పుష్పం :-
ఏమి సరస్వతీ విభవమెంతన నా అవధానవిద్యలన్
నా మది పొంగిపోవ విననా యిటకమ్మని పద్యపూరణల్
భామ, విరించి రాణి కన ఈ కవితాఝరి తేనెసోనగా
నా మది తాకుచుండె కనగా యిదివొక్క తెలుంగుభాగ్యమే.

రెండవ పుష్పం :-

కన నా అవధానమ్మిదె
విన ఈ కవితావిశారదావిన్నాణం
అన నా అంధ్రుల సొమ్మిం
తన, యెద పొంగె రసతరంగిణిలోనన్.

బుధజన విధేయురాలు

చల్లా మైత్రేయి.








Friday, May 16, 2008

చెప్పాలని వుంది....గొంతు విప్పాలనిఉంది....


"విశ్వశ్రేయ: కావ్యం" అన్నారు పెద్దలు. సమాజహితాన్ని కోరేదే సాహిత్యం కదా!
భారతదేశ ప్రస్తుతపరిస్థితులు పరిశీలిస్తుంటే, భారత పౌరులమైన మనం భారతీయులుగా మిగుల్తామా భవిష్యత్తులో? అనే సందేహం పీడిస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో మన రాష్ట్రమే గాదు, దేశమంతా సమాజపరం గానూ, రాజకేయ విన్యాసాల్లోనూ, విద్యా వ్యాసంగాల్లోనూ సభ్యతాసంస్కారాలే గాదు సంస్కృతీసంప్రదాయాల విలువలే మారిపోతున్నయి.

అన్నిరంగాల్లో అభివృద్ధి ఆశిస్తూ అందుకై ప్రయత్నించే మనిషి ముందుగా నేర్చేది విద్య. యెవరైనా గతాన్ని తెలుసుకుంటే వర్తమానం లో ఆ లోటు పాట్లు దిద్దుకుని భవిష్యత్తు లో వృద్ధి పొంది, కీర్తి ప్రతిష్టలతో ఆదర్శం గా గడుపడానికి గతం అవసరమన్నది నిత్య సత్యం. దాన్ని స్వభాషలో నేర్చి, అర్ధం చేసుకోవడం సహజమే గాక సులభ సాధ్యమన్నది కాదనలేని నిజం.

అవన్నీ మరచి ఈనాడు మనం వ్యవహరిస్తున్న తీరూ సమాజం లో దాని ఫలితం భావిపౌరులైన మన పిల్లల అభ్యుదయం కోరే తల్లిదండ్రులనూ, మేధావులనూ కలవర పరిచే నిష్ఠూరనిజాన్ని గమనిస్తే, తెలుగు వారు తెలుగు జాతి అన్నది ఒకప్పుడీ దేశం లో వుండేది కాబోలు అని మన పిల్లలే అనుకునే రోజు రాబోతోంది కదా! అనుకుంటూ, ఆగని ఆంధ్రభారతి అంతరంగ ఆవేదనయే పాండిత్యప్రతిభ లేని నా చేత ఈ చిన్ని పొత్తంగా రూపొందినట్లనిపిస్తోంది.

సహృదయులూ, మేధావంతులూ, ఆత్మాభిమానం తో అలరారే తెలుగు బిడ్డలూ వారి ఆత్మవిశ్వాసాన్ని అభిమానాన్నీ నిలుపగలిగేలా, సాంకేతికపరంగా కూడా భాషా వికాసానికీ, మన తెలుగు వారి ప్రత్యేకత చిరస్థాయిగా నిల్పుటకు తోడ్పడి తెలుగుభాషకు జవజీవాలనందించగలరని ఆశిస్తూ.. భాషాసరస్వతి ఆశీస్సులందుకొమ్మని అభ్యర్ధిస్తూ..
బుధజన విధేయురాలు
చల్లా మైత్రేయి