Wednesday, May 28, 2008

శ్రీరామ శతకం


శ్రీరామ శతకం


శ్రీశ శ్రీరామరావయ్య సీతగూడి
భక్తులనుజూసి కాపాడ భద్రగిరికి
వేడ్కనిన్ జూడభద్రుడు వేడగానె
రామశరణము శ్రీరామరామరామ


తల్లిభూదేవి రాక్షసతంత్రమునకు
ఓర్పు నశియించి బాధలనోపలేక
బాధబాపగ పద్మ సంభవునివేడ
రామరావయ్య శరణు శ్రీ రామరామ


తాను శివభక్తుడనని నమ్మి తన్మయమున
తపసుచే వరమందిన తామసుండు
పదితలల రావణుని చంపు పరంధామ
రామశరణము శ్రీరామరామరామ



Sunday, May 25, 2008

ఈ మాధుర్యం తెలుగు వారిది(కి) మాత్రమే...

తెలుగుభాషకే ప్రత్యేకత సంతరించి భారతీశిరోభూషణమైన అవధాన పద్ధతికి భక్త్యంజలి....
మొదటి పుష్పం :-
ఏమి సరస్వతీ విభవమెంతన నా అవధానవిద్యలన్
నా మది పొంగిపోవ విననా యిటకమ్మని పద్యపూరణల్
భామ, విరించి రాణి కన ఈ కవితాఝరి తేనెసోనగా
నా మది తాకుచుండె కనగా యిదివొక్క తెలుంగుభాగ్యమే.

రెండవ పుష్పం :-

కన నా అవధానమ్మిదె
విన ఈ కవితావిశారదావిన్నాణం
అన నా అంధ్రుల సొమ్మిం
తన, యెద పొంగె రసతరంగిణిలోనన్.

బుధజన విధేయురాలు

చల్లా మైత్రేయి.








Friday, May 16, 2008

చెప్పాలని వుంది....గొంతు విప్పాలనిఉంది....


"విశ్వశ్రేయ: కావ్యం" అన్నారు పెద్దలు. సమాజహితాన్ని కోరేదే సాహిత్యం కదా!
భారతదేశ ప్రస్తుతపరిస్థితులు పరిశీలిస్తుంటే, భారత పౌరులమైన మనం భారతీయులుగా మిగుల్తామా భవిష్యత్తులో? అనే సందేహం పీడిస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో మన రాష్ట్రమే గాదు, దేశమంతా సమాజపరం గానూ, రాజకేయ విన్యాసాల్లోనూ, విద్యా వ్యాసంగాల్లోనూ సభ్యతాసంస్కారాలే గాదు సంస్కృతీసంప్రదాయాల విలువలే మారిపోతున్నయి.

అన్నిరంగాల్లో అభివృద్ధి ఆశిస్తూ అందుకై ప్రయత్నించే మనిషి ముందుగా నేర్చేది విద్య. యెవరైనా గతాన్ని తెలుసుకుంటే వర్తమానం లో ఆ లోటు పాట్లు దిద్దుకుని భవిష్యత్తు లో వృద్ధి పొంది, కీర్తి ప్రతిష్టలతో ఆదర్శం గా గడుపడానికి గతం అవసరమన్నది నిత్య సత్యం. దాన్ని స్వభాషలో నేర్చి, అర్ధం చేసుకోవడం సహజమే గాక సులభ సాధ్యమన్నది కాదనలేని నిజం.

అవన్నీ మరచి ఈనాడు మనం వ్యవహరిస్తున్న తీరూ సమాజం లో దాని ఫలితం భావిపౌరులైన మన పిల్లల అభ్యుదయం కోరే తల్లిదండ్రులనూ, మేధావులనూ కలవర పరిచే నిష్ఠూరనిజాన్ని గమనిస్తే, తెలుగు వారు తెలుగు జాతి అన్నది ఒకప్పుడీ దేశం లో వుండేది కాబోలు అని మన పిల్లలే అనుకునే రోజు రాబోతోంది కదా! అనుకుంటూ, ఆగని ఆంధ్రభారతి అంతరంగ ఆవేదనయే పాండిత్యప్రతిభ లేని నా చేత ఈ చిన్ని పొత్తంగా రూపొందినట్లనిపిస్తోంది.

సహృదయులూ, మేధావంతులూ, ఆత్మాభిమానం తో అలరారే తెలుగు బిడ్డలూ వారి ఆత్మవిశ్వాసాన్ని అభిమానాన్నీ నిలుపగలిగేలా, సాంకేతికపరంగా కూడా భాషా వికాసానికీ, మన తెలుగు వారి ప్రత్యేకత చిరస్థాయిగా నిల్పుటకు తోడ్పడి తెలుగుభాషకు జవజీవాలనందించగలరని ఆశిస్తూ.. భాషాసరస్వతి ఆశీస్సులందుకొమ్మని అభ్యర్ధిస్తూ..
బుధజన విధేయురాలు
చల్లా మైత్రేయి