Friday, May 16, 2008

చెప్పాలని వుంది....గొంతు విప్పాలనిఉంది....


"విశ్వశ్రేయ: కావ్యం" అన్నారు పెద్దలు. సమాజహితాన్ని కోరేదే సాహిత్యం కదా!
భారతదేశ ప్రస్తుతపరిస్థితులు పరిశీలిస్తుంటే, భారత పౌరులమైన మనం భారతీయులుగా మిగుల్తామా భవిష్యత్తులో? అనే సందేహం పీడిస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో మన రాష్ట్రమే గాదు, దేశమంతా సమాజపరం గానూ, రాజకేయ విన్యాసాల్లోనూ, విద్యా వ్యాసంగాల్లోనూ సభ్యతాసంస్కారాలే గాదు సంస్కృతీసంప్రదాయాల విలువలే మారిపోతున్నయి.

అన్నిరంగాల్లో అభివృద్ధి ఆశిస్తూ అందుకై ప్రయత్నించే మనిషి ముందుగా నేర్చేది విద్య. యెవరైనా గతాన్ని తెలుసుకుంటే వర్తమానం లో ఆ లోటు పాట్లు దిద్దుకుని భవిష్యత్తు లో వృద్ధి పొంది, కీర్తి ప్రతిష్టలతో ఆదర్శం గా గడుపడానికి గతం అవసరమన్నది నిత్య సత్యం. దాన్ని స్వభాషలో నేర్చి, అర్ధం చేసుకోవడం సహజమే గాక సులభ సాధ్యమన్నది కాదనలేని నిజం.

అవన్నీ మరచి ఈనాడు మనం వ్యవహరిస్తున్న తీరూ సమాజం లో దాని ఫలితం భావిపౌరులైన మన పిల్లల అభ్యుదయం కోరే తల్లిదండ్రులనూ, మేధావులనూ కలవర పరిచే నిష్ఠూరనిజాన్ని గమనిస్తే, తెలుగు వారు తెలుగు జాతి అన్నది ఒకప్పుడీ దేశం లో వుండేది కాబోలు అని మన పిల్లలే అనుకునే రోజు రాబోతోంది కదా! అనుకుంటూ, ఆగని ఆంధ్రభారతి అంతరంగ ఆవేదనయే పాండిత్యప్రతిభ లేని నా చేత ఈ చిన్ని పొత్తంగా రూపొందినట్లనిపిస్తోంది.

సహృదయులూ, మేధావంతులూ, ఆత్మాభిమానం తో అలరారే తెలుగు బిడ్డలూ వారి ఆత్మవిశ్వాసాన్ని అభిమానాన్నీ నిలుపగలిగేలా, సాంకేతికపరంగా కూడా భాషా వికాసానికీ, మన తెలుగు వారి ప్రత్యేకత చిరస్థాయిగా నిల్పుటకు తోడ్పడి తెలుగుభాషకు జవజీవాలనందించగలరని ఆశిస్తూ.. భాషాసరస్వతి ఆశీస్సులందుకొమ్మని అభ్యర్ధిస్తూ..
బుధజన విధేయురాలు
చల్లా మైత్రేయి

2 comments:

Anil Dasari said...

నిజమే. ఇతరభాషలూ నేర్చుకోవాలి, కానీ ముందు మాతృభాష మీద దృష్టి పెట్టాలి. మాతృభాషే సరిగా రానివాళ్లు పరాయిభాషలో పండితులెలా కాగలుగుతారు? సమస్యేమిటంటే, చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇంగ్లీషు దిశగా ప్రోత్సహిస్తున్నారే కానీ తమ భాష నేర్పించటంపై దృష్టి పెట్టటం లేదు. ఇది తెలుగు భాష సమస్య మాత్రమే కాదు. దాదాపు దేశంలోని అన్ని భాషలకూ ఇదే సమస్య. ఇంగ్లీషు రాకపోతే తమ పిల్లలెక్కడ వెనకబడిపోతారో అన్న వాళ్ల భయం అర్ధం చేసుకోదగినదే కానీ, ఆ కారణంగా స్వభాషని నిర్లక్ష్యం చెయ్యటం ఎంతవరకూ సబబు?

http://anilroyal.wordpress.com

Kottapali said...

"సభ్యతాసంస్కారాలే గాదు సంస్కృతీసంప్రదాయాల విలువలే మారిపోతున్నయి."

చాలా బాగా చెప్పారు. మీ నించి ఆలోచనా పూరితమైన మంచి టపాలు మరిన్ని ఆశిస్తూ